విజయవాడ మణిక్రాంతి హత్య కేసులో నయా ట్విస్ట్.. స్కూటీపై వెళ్లిన ఆ ఇద్దరు ఎవరు?

  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు
  • ప్రదీప్‌కు ఆయన కుటుంబ సభ్యులు సహకరించారని ఆరోపణ
  • ఇప్పటికీ దొరకని మణిక్రాంతి తల
విజయవాడ, సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీలో భార్య తలనరికిన కేసులో కొత్త కోణం ఒకటి వెలుగులోకి వచ్చింది. మణిక్రాంతి హత్య ఘటనలో భర్త ప్రదీప్ కుమార్ తో పాటు ఆయన బంధువుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. అయితే, పోలీసులు మాత్రం దీనిని కొట్టిపడేస్తున్నారు. ప్రదీప్ ఒక్కడే మణిక్రాంతిని చంపాడని చెబుతున్నారు.

సీసీ టీవీ దృశ్యాలకు తోడు మణిక్రాంతి సోదరి పూజారాణి చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. తన సోదరిని చంపుతుండగా చూసిన కొందరు తనకీ విషయం చెప్పారని పేర్కొంది. మణిక్రాంతిని చంపుతుండగా రికార్డైన దృశ్యాల్లో స్కూటీ ఆగి ఉండడం, ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి ఎక్కిన తర్వాత వెళ్లిపోయినట్టు ఉంది. స్కూటీపై వెళ్లిన వారిద్దరూ నిందితుడి బంధువులేననేది పూజారాణి ఆరోపణ. బంధువుల సహకారం లేకుండా ప్రదీప్ ఒక్కడే ఈ పని చేసి ఉండడని బాధితురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్కూటీ రిజిస్ట్రేషన్ నంబరు కనిపిస్తే హత్య కేసులో చిక్కుముడి వీడుతుందని అధికారుల చెబుతున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మణిక్రాంతి కుటుంబ సభ్యులు,  ప్రదీప్ బంధువులను విచారిస్తున్నారు. మరోవైపు, మణిక్రాంతి తలకోసం గాలిస్తున్న పోలీసులకు ఇప్పటి వరకు అది దొరకలేదు. తల లేకుండా పోస్టుమార్టం చేయడానికి వీల్లేదని, చేసినా మృతదేహాన్ని తీసుకెళ్లబోమని మణిక్రాంతి కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.  
Go Back to Shorts
Vijayawada
murder
Manikranthi
Andhra Pradesh

More Telugu News